sridevi suuden death | super star sridevi passes away

అతిలోకసుందరి ఇకలేరు


మొదట షాకింగ్. ఆ పై నిజం కాదేమో?  ప్రముఖుల్ని అప్పుడప్పుడు చంపేసే ఎలక్ట్రానిక్ మీడియా ఈసారి  శ్రీదేవిని చంపేసి ఉంటుందేమో?  బ్రేకింగ్ న్యూస్ కాస్త.. తప్పని ఖండన వేస్తారేమోనన్న ఎదురుచూపు. కానీ.. ఒకటి తర్వాత ఒకటిగా పడుతున్న బ్రేకింగ్ న్యూస్ తో సగటు సినీ జీవి గుండె బద్ధలైంది.

తామెంతో అపురూపం అనుకునే అతిలోక సుందరి శ్రీదేవి.. అందరిని వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయింది. కాదు.. కాదు.. దేవుడు తీసుకెళ్లిపోయాడేమో. చివరి క్షణం వరకూ అతిలోక సుందరిగానే గడిపిన ఆమె అవసరమైందో ఏమో కానీ.. భగవంతుడు పిలిచినట్లుగా వెళ్లిపోయారు. ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన 54 ఏళ్ల శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కాసేపటికే ప్రాణాలు విడిచారు.
శ్రీదేవి మరణించిన వార్తను ఆమె భర్త బోనీకపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ధ్రువీకరించారు.

శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో (దుబాయ్ కాలమానం ప్రకారం?) ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి చివరి శ్వాస వదిలే సమయంలో ఆమె భర్త బోనికపూర్.. కుమార్తె ఖుషీ పక్కనే ఉన్నట్లుగా చెబుతున్నారు.

బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా పెళ్లి నిమిత్తం.. ఆ వేడుకలో పాల్గొనేందుకు భర్త.. చిన్నకుమార్తెతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. పెద్ద కుమార్తె జాహ్నవి సినిమా షూటింగ్ కారణంగా వెళ్లలేదని తెలుస్తోంది. తల్లి మరణవార్త విన్న వెంటనే దుబాయ్ వెళ్లినట్లుగా చెబుతున్నారు.
శ్రీదేవి మరణ వార్త విన్నంతనే బాలీవుడ్ తో పాటు యావత్ భారత దేశం దిగ్భాంత్రికి గురైంది. దేశ ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఈ విషయం బ్రేక్ అయ్యింది. తెల్లవారుజామున మూడున్నర గంటల వేళలో ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేశాయి.

తమిళనాడులోని శివకాశీలో 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మాయాంగేర్ అయ్యపాన్. సినిమాల్లోకి వచ్చాక ఆమె శ్రీదేవిగా మారారు.బాలనటిగా కందన్ కరుణ్ (తమిళ్)  సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. బాలనటిగా తెలుగు సినిమాల్లో నటించారు. పదహారేళ్ల వయసు చిత్రంతో హీరోయిన్ గా ఆమె కెరీర్ మొదలైంది.

బాల్యంలోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె తుదిశ్వాస విడిచేవరకూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తెలుగులో ఆమె తొలిచిత్రం మా నాన్న నిర్దోషి. చివరి చిత్రం మామ్. 2017లో ఈ చిత్రం విడుదలైంది. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో రెండో ఇన్నింగ్స్ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి..ఆ తరువాత తమిళంలో పులి చిత్రంలో నటించారుతెలుగు.. తమిళం.. మళయాళం.. కన్నడ.. హిందీ చిత్రాల్లో ఆమె నటించారు.

దేశంలో తొలి మహిళా సూపర్ స్టార్ గా ఆమెను అభివర్ణించొచ్చు. శ్రీదేవి స్థానాన్ని మరెవరూ ఎప్పటికీ చేరుకోలేరని చెప్పక తప్పదు. తెలుగు తెరపై అగ్రహీరోలందరితో ఆడిపాడిన శ్రీదేవిని అతిలోక సుందరిగా కీర్తిస్తుంటారు.
1996లో బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ.. ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పటివరకూ శ్రీదేవి 15 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.

వయసు పెరుగుతున్నా అతిలోక సుందరి అన్నట్లే ఉన్నారు. తెలుగులో 85.. హిందీలో 71.. తమిళంలో 72.. మళయాళంలో 26.. కన్నడంలో ఆరు చిత్రాల్లో నటించారు. దక్షిణాదికి చెందిన శ్రీదేవి.. బాలీవుడ్ లో కాలు మోపి తన సత్తాను చాటటమే కాదు.. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేలా చేశారు. సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారతసర్కార్ శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది. నమ్మలేని నిజంగా మారిన శ్రీదేవి మరణం.. యావద్దేశానికి భారీ షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

శ్రీదేవి ఆఖరి క్షణాలు : 

Comments